Friday, June 5, 2015

॥ చేరలేని గమ్యం ॥
అమ్మ అని హత్తుకున్నఆరోజులు కావాలని
బుజ్జగించి గోరుముద్దలు మళ్ళీ తినిపించాలని
నీ బుడి బుడి నడకల్నివెనుక కెళ్ళి చూడాలని
అడుగడుగున నీ గెలుపులు ఆ గర్వం నీదవ్వాలని
సైకిల్ పై నీ స్వారీ విజయం నీదేనంటూ
నవ్వుతున్న చిన్నినాన్న ఆరూపం మళ్ళీ నాదవ్వాలి
నీ జీవన పోరాటంలోఓడానూ చివరంటా
ఏమాయనో ఆరోజున విషమని వేదన మింగా
నీ స్పర్శలు కావాలని తల్లడిల్లుతున్న మనసు
జ్ఞాపకాల తడులలో నిన్నుతడుము కుంటున్నా
మౌనమైన మనసులో నీమాటలు గుర్తెరిగి
గుండె పగిలి పోతోంది రాలేవని తలచి తలచి
చెదిరిన ఆశవు నీవు బాధ్యతల బందీ నేను
చేరలేని గమ్యం నీవు వేదన బానిస నేను
నిశ్శబ్దం మనసులోన పెదవులనీ కదపలేక
మనసు తడిని తుడవలేను గాయపుమచ్చను చెరపలేక
కంటి తడులు అక్షరమై కవనమై పోతోంది
చెరపలేని గాయాలు కావ్యంగా మిగులుతూ
అక్షరమే ఆదుకుంది ఆత్మీయత అందిస్తూ
చెరిగిపోని గాయానికి చేయూతగ నిలుస్తూ
..... వాణి, 23 april 15

No comments:

Post a Comment