Friday, June 5, 2015

॥ శిధిలం॥
హిమ శిఖరం అంచున చల్లగున్నామనుకున్నాం
పశుపతుని నీడలోన ప్రశాంతమే అనుకున్నాం
గౌతముడు నడయాడిన నేల అని ధీమాగానే వున్నాం
అవని తల్లి ఒక్కసారి జలదరింప చేసింది
స్వార్ధపరుల చేస్తూన్న అరాచకం
అమాయకుల బ్రతుకులెన్నొబలిఅవుతూ
ధరణి మాత ఓర్పు అంతా నశిస్తూ
తనకు తగిలే గాయాలకు తల్లడిల్లి పోతోంది
మానవ తప్పులే బ్రతుకులు చిద్రం చేశాయి
ఒక్కోసారి ఒకోచోట తన ప్రతాపం చూపుతోంది
జాడలేక తన బిడ్డల గుండె కూల్చి వేసింది
మరువలేని విషాదాన్ని చరిత్రలో నిలిపింది
భూమాతకు తన బిడ్డలపై అంత కోపమెందుకో
శతాబ్దాల చరిత్రలను చిద్రం చేసేశను
నడయాడే దారులను నెర్రెలు చీల్చేసెను
వేవేల ప్రాణాలను ఆవహింపజేసుకొనెను
పశుపతి పూజించిరి విష్ణువును ప్రార్దించిరి
ఏదేవుడు కరుణించక దేశాన్నే వల్లకాడు చేశేసిరి
గుట్టలుగా ఆ బ్రతుకులు ఒక్కసారి కాల్చేసిరి
మనమనసులు తల్లడిల్లే ఆ గుండెలు ఆగినపుడు
ముద్దులొలుకు చిన్నారుల రోదన వినిపించ లేద?
భావిపౌరుల ఆర్తనాదం ఆలకించ లేదా ?
నడవలేని ముసలి వారు గోడు గోడు మన్నారే
నేపాలీ జనమంతా నిశ్చేష్టులయ్యారే
నిలువ నీడ కోల్పోయి నిర్భాగ్యులయ్యారే
కొన్ని క్షణాలు మన పనులను ప్రక్కనుంచి స్పందిద్దాం
సాయం చేసే చేతులకు చేయూత నందిద్దాం
చేయి చేయి కలిసినపుడు సాధ్యంకానిదేముంది
(నేపాల్ విద్వంశం అక్షరాల్లో.... )

....వాణి ,30 April 15
ఈ మధ్య నే పెళ్ళి జరిగిన మా బాబాయి కూతురు( లత ) గుండెనొప్పితో మరణాన్ని తట్టుకోలేక చెల్లి ఆత్మశాంతి కోరుకుంటూ
....నివాళి ....
పారాణి పాదాలు ఆరనే లేదు
పెళ్ళి బడలికింక మాకు తీరనే లేదు
చెరిగిపోనే లేదు నీ చేతి గోరింట ఇంకా
చెదిరిపోయాయా చెల్లి నీ కలలు అన్నీ
నీవు నడచిన ఏడడుగులు వెన్నెల నడకలనుకున్నాము
కొత్త జీవితానికి దారులే అనుకున్నాము
పెళ్ళి పీటల మీద నీ నవ్వులన్నీ
మెదులుతూనే వున్నాయి మా కనుల ముందు
ఆశలన్నీ నీకు మూటకట్టి ఇచ్చాము
వడిబియ్యముతో పాటు అత్తంటికంపాము
లతలా నీ జీవితాన్ని అల్లుకుంటావనుకున్నాము
వడలిన తీగవై నేల రాలిపోయావు
అంతలోనే నీకు అంతిమయాత్రనా చెల్లి
ఆశ్చర్యాలనుండి తేరుకో లేకున్నాము
చిగురించక నీ చిరునవ్వులు చితికి చేరువయ్యాయి
కలతతో మేమంత కన్నీటితో మిగిలాము
నీ ఆత్మశాంతి కోరుకుంటూ
నిశ్చేష్టులై మిగిలాము
....అక్క with Manoj Kumar Sharma
..... అమ్మ బాష ....
అమ్మ బాష తెలుగు
కమ్మని బాష తెలుగు
తియ్యనైన బాష 
తేనెలొలుకు బాష
యాస యేదైతేనేం
బాష ఒక్కటే
ప్రాంతమేదైతెనేం
ప్రాంతీయబాష తెలుగేగా
కాళేస్వరం,శ్రీశైలం,భీమవరం
శైవ క్షేత్రాలే త్రిలింగ దేశమై
ఈమూడు ప్రాంతీయుల బాషే
తెలుంగు గా నానుడి
తెలుగుబాష మనదిగా
వెలుగొందేబాష మనదేగా
పసందైన బాష
పరవసించే బాష
సంస్కృతంలోని తియ్యదనం,
కనడంలో అమృతత్వం,
తమిళములోని పరిమళం
కలగలిపిన కమ్మనైన బాష తెలుగేగా
తెలుగు సోదరులం మనం
తెలుగు తల్లి బిడ్డలం
మనకెందుకు వైవిద్యం,
మనకెందుకు వైరుడ్యం
కలసికట్టుగ నడుంకట్టి
ప్రగతి రధం లాగుదాం
తెలుగువారిలో
సమైక్యతను పెంచుదాం
రాబోయే తరాలకు
తెలుగుబాషపై ఆసక్తిని పెంచుదాం
మన బాషా
సమైక్యతను చాటుదాం
...................వాణి కొరటమద్ది
..............అమ్మ ............
ఏ జామున లేచేదో, నే లేచేసరికి
వాకిట్లో ముగ్గులు. ఆరేసిన బట్టలు మెరుస్తున్న గిన్నెలు
పూర్తయిన పనులన్నీ చూసి ఆశ్చర్యమే నాకపుడు 
అమ్మ మాత్రం లలితమ్మను స్మరిస్తూ దేవుడి ముందు కనపడేది
అమ్మ పడే కష్టం చూసి మనసు కలుక్కు మనేది
పాల గ్లాసు అక్కడ అంటూ సైగ చేసేది
ఎపుడూ నా ఉనికి కనిపెడుతూనే వుండేది
అమ్మ అంతగా చదువుకోలా
నన్ను మాత్రం చదివవించాలని ఆరాట పడుతుండేది
ఉన్నత స్ధానంలో చూడాలని ఆత్ర పడుతుండేది
అపుడనిపించేది నాలో ఆత్మవిశ్వాసం నింపాలనే ప్రయత్నం కాబోలని
ఎన్ని కధలు చెప్పింది అమ్మ
ఆ కధలన్నీ వీరత్వము చాటుకున్న మహిళలవే
నన్నే నాయిక చూపిస్తూ
ఆవిధంగా ధైర్యాన్ని నేర్పిందనుకుంటా అమ్మ
నే స్కూల్ నుండి వచ్చేసరికి
మొక్కలకు సేవచేస్తూ అమ్మ చిరునవ్వుతో
నాకు కాసిన్ని కలుపుమొక్కలు ఏరమని పురమాయించేది
అపుడూ అనిపించింది నాకు
ప్రకృతిని ప్రేమించమని
చెడ్డవారిని చెంతనుంచుకోవద్దని చెప్పినట్లుగా
రాత్రి అమ్మ ప్రక్కనే ఆరుబయట పడుకున్నపుడు
చందమామ కధలెన్నో
నక్షత్రాల పేర్లనూ చెప్పేది
ఆ పేర్ల వెనుక అంతరార్ధాన్ని వివరిస్తూ
అనిపించింది అపుడు నాకు
అమ్మ మనసు ఆకాశమంత విశాలమని
ఐదుదాకే చదివిన అమ్మ ఎంత ఉన్నతంగా ఆలోచించిందని
నేనమ్మనయ్యాక అర్ధమయ్యింది
అమ్మ అంతేనని స్త్రీ అంటేనే సహనమని...... !!
.
మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
..............వాణి కొరటమద్ది

శర్మ గారి విశ్లేషణలోనా కవితను చూసుకోవాలని చాలా రోజుల నుండి కోరికగా వుండేది ఈరోజు నా కవిత శర్మ గారి అంతటి వారి దృష్టిలో పడ్డం నాకు చాలా సంతోషంగా వుంది. మీ కలంద్వారా విశ్లేషణకి నోచుకోవడం..అదృష్టంగా భావిస్తున్నాను హృదయ పూర్వక కృతజ్ఞతలు శర్మ గారు. __/\__
ఈనాటికవిత-14
___________________________
కొరటమద్దివాణి-ప్రశ్న
"ఆశాబద్ధతే జంతు:కర్మణా బహుచింతయ:" అని భారతీయవేదాంతులు చెప్పారు.జీవితాన్ని సుఖవంతంగా ,సంతృప్తిగా గడపడానికి మనిషి కొన్ని ఆలోచనలు చేస్తాడు..కాని ఒక్కోసారి అవి సత్ఫలితాలను ఇయ్యకపోవచ్చు.దానివల్ల నిరాశ కలుగుతుంది.ఆనందం ఆశ ఫలవంతమవటం వల్ల కలుగుతుంది.ఆ ఆనందం నైతికప్రయోజనాలను సమకూరుస్తుందని అంటాడు బెంతం.(Bentheam.Jeremy)ఈ ఆనందంకోసం తాపత్రయపడనివారుండరు.ఆశకు నిరాశకు మధ్య కలిగేప్రశ్నలను,సంధిగ్ధతను కొరటమద్ది వాణి కవిత్వం చేసారు.ఆలోచనలవల్ల కలిగే నిద్రలేమి నుంచి కవితప్రారంభమవుతుంది.ఎత్తుగడే విఫలం తరువాతి స్థితినుంచి మొదలవుతుంది.
"నిద్రలేని రాత్రులు వెక్కిరిస్తూనే వున్నాయి
కురుస్తున్న కన్నీళ్ళు
మనసు తడి ఆరనివ్వడంలేదు
ఆశలన్నీ మూటకట్టుకుని మూల నుండి పోయాయి
కొత్త జీవితానికి పునాదులేయ్యాలనిపిస్తుంది"
ఈ వాక్యాల్లో మనోవైజ్ఞానిక సుఖవాదం(Psychological hedonism)ఉంది.మిల్(Mill.John Stuart)ఇందులో ప్రముఖుడు.కవిత ఆసాంతం ఈ ప్రభావం ఎక్కువే.మిల్ దీన్ని సాధారణ సుఖవాదమని అన్నాడు .దానికి కారణం మానవుడు ఎప్పుడు ఏదో కాంక్షలో నే ఉంటాడని ఆయన భావన. కాంక్ష,సుఖం ఈ రెండు ఒకే దృష్టాంతంలోని రెండురీతులని మిల్ అన్నాడు.
1.కాసిని స్వప్నాలను కలుపుకుంటూ
మనసును ప్రక్ష్యాళన చేసే ప్రయత్నం చేస్తాను
2.తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది
కాంక్ష,ఆశ అనేపదం లక్ష్యసంబంధమయింది.ఈ మార్గంలో మనసు లక్ష్యాన్ని కాంక్షిస్తుంది కాని,సుఖాన్ని కాదని -సిడ్ఫ్ నిక్ అంటాడు.ఆశ గురించే ఆలోచిస్తుంటే అది దూరం కావొచ్చు దీనిని ఆయన సుఖవిరోధాభాస(Paradox of hedonism)అన్నాడు.వాణి కొరటమద్ది కవిత్వంలో ఈ భావన కూడా కనిపిస్తుంది.ఈ వాక్యాలు అందుకు ఉదాహరణ.
"సాధ్యం కాని సౌధాలు ఎలా నిర్మిస్తావని ?
ఊరుతున్న నీళ్ళలో ఊహలభవనమెలా?
అడియాశల శిఖరాలు అవసరమా?
సర్దుకోమంటూ మనసు హెచ్చరిస్తూనే వుంటుంది
మౌనంగా వుండిపోయాను
చేజారిన చిరునవ్వులు మరల రావనిపించి
మానని గాయాన్ని మది మరువలేదనిపించి."
కవితా నిర్మాణానికి సంబంధించి రెండు యూనిట్ లు రూపకాత్మకంగా కనిపిస్తాయి.నీళ్లు ఊరటం -కష్టాలు కలగటం.ఇవన్నీ నిర్మాణంలో భాగంగా కనిపిస్తాయి.
"నేత్రాల చెరువులు
నిరాశల నీళ్ళు నిండా నింపుకుని వుంటాయి
జీవితాన్ని మార్చాలని ఆరాట పడుతూనే వుంటాను
తవ్వే కొద్దీ ఊరుతున్న నీళ్ళను ఆపలేక పోతాను
ఆశల ఇటుకలను పేర్చాలనే ప్రయత్నం
చేస్తూనే వుంటాను
తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది"
తాత్వికమైన భావనతో ఒక సంఘర్షణను కవితగా మలిచారు.కొన్ని పదబంధాలు కూడా అంతే తాత్వికంగా కనిపిస్తాయి.-"ఆశల ఇటుకలు,నేత్రాల చెరువులు,నిరాశల నీళ్ళు,అడియాశల శిఖరాలు"- లాంటివి ఆమార్గంలో కనిపిస్తాయి.ఒక వస్తువును భావనను కవితగా మార్చడానికి ఎంత ప్రయత్నం కావాలో ఈ కవిత చెబుతుంది.
ఏ ఎమరపాటో మిమ్ము అనాధను చేసింది
కాలం గాయం చేసి విధి వెక్కిరించింది
ఏ నిర్లక్ష్యపు సంతకం మీ జాడ నిలిపిందో
ఆమె అసహనమో అమాయకత్వమో 
ఏమృగము గాయ పరిచిందో
వెలుతురులోకొచ్చి వెలుగులకై వెతుకుతున్నారు
మరలరాని అమ్మకై ఆరాటపడుతున్నారు
తలకు మించిన భారమే మీ బ్రతుకు పోరాటం
తమ్మునికి అమ్మవై మెదలెట్టాలి నీ జీవన సమరం
తడికనులు తుడుచుకుని ముందు నడక సాగించు
దరి చేరవు ఏ పధకాలు మీ కడుపు నింపాలని
ఆపన్న హస్తాలన్నీ స్వార్ధంతో నిండాయి
నీకు నువ్వే జాగ్రత్తనుకుంటూ
నీ తమ్ముని బ్రతుకు కర్తగ మారిపో


॥ మది సంఘర్షణ॥
మది లోతుల్ని తవ్వుకుంటూనే వుంది మనసు
ఎగురుతున్న ఎత్తుల్ని చేరుకోలేక
మధ్యన కలుక్కుమంటున్న ఓ జ్ఞాపకం 
తడి తరగల్ని తుడుచుకోలేక
కన్నీటి సంద్రం చేసిన సందర్భం
చుట్టు ప్రక్కలకి చూపు విదల్చలేక
చిరునవ్వుల పలకరింపులకు
కనులు చెప్పలేని సమాధానం
సందిగ్దమో ,సంసయమో సర్ది చెప్పలేని ప్రశ్నలు
ఎదురోచ్చేఆశలు వెంటాడుతున్న ఆశయాలు
కట్టి పడేస్తున్న మౌన సంఘర్షణలు చేరలేని గమ్యాలు
ఎదురొచ్చే ప్రశ్నార్ధక వదనాలు
మరుపుతో మాయమవుతున్న అంతరంగ దృశ్యాలు
తప్పనిసరి గమనాలు అనాసక్తి అవసరాలు
సాగిపోతూ సమయాలు
చెదిరిపోక వేదన మిగిల్చిన ఆనవాళ్ళు ...!!
.......వాణి
॥ చేరలేని గమ్యం ॥
అమ్మ అని హత్తుకున్నఆరోజులు కావాలని
బుజ్జగించి గోరుముద్దలు మళ్ళీ తినిపించాలని
నీ బుడి బుడి నడకల్నివెనుక కెళ్ళి చూడాలని
అడుగడుగున నీ గెలుపులు ఆ గర్వం నీదవ్వాలని
సైకిల్ పై నీ స్వారీ విజయం నీదేనంటూ
నవ్వుతున్న చిన్నినాన్న ఆరూపం మళ్ళీ నాదవ్వాలి
నీ జీవన పోరాటంలోఓడానూ చివరంటా
ఏమాయనో ఆరోజున విషమని వేదన మింగా
నీ స్పర్శలు కావాలని తల్లడిల్లుతున్న మనసు
జ్ఞాపకాల తడులలో నిన్నుతడుము కుంటున్నా
మౌనమైన మనసులో నీమాటలు గుర్తెరిగి
గుండె పగిలి పోతోంది రాలేవని తలచి తలచి
చెదిరిన ఆశవు నీవు బాధ్యతల బందీ నేను
చేరలేని గమ్యం నీవు వేదన బానిస నేను
నిశ్శబ్దం మనసులోన పెదవులనీ కదపలేక
మనసు తడిని తుడవలేను గాయపుమచ్చను చెరపలేక
కంటి తడులు అక్షరమై కవనమై పోతోంది
చెరపలేని గాయాలు కావ్యంగా మిగులుతూ
అక్షరమే ఆదుకుంది ఆత్మీయత అందిస్తూ
చెరిగిపోని గాయానికి చేయూతగ నిలుస్తూ
..... వాణి, 23 april 15
చినుకుల తడి నేల రాలి
స్వచ్చతను కోల్పోతూ
వెలుగులేని దీపమకడ
వేలాడుతూ శక్తిలేక
తడి కావాలని తపియిస్తూ
మేల్కొంది పచ్చదనం
మట్టి వాసన మనసంతా
పులకింతను పంచుతోంది
వికసించిన కుసుమాలు
భ్రమరాలకై వేచి యుండి
మధువు గ్రోలు పెదవి స్పర్శ
కోరుకునే ఆరాటం
తడవాలని ఆశతోన
తడబడుతూ తడి అడుగులు
ప్రతి అడుగూ గెలవాలని
మనసును గెలిపించాలని