Sunday, July 27, 2014

//కడలి//

సముద్రపుజీవిలా నేనూ సునామీల నెదుర్కొన్నాను
ప్రళయంతర్వాత ప్రశాంతతను పొoదలేకున్నాను
బలవంతపు బ్రతుకు చట్రంలో విధి లేక తిరుగుతూ
వేదనతో మిగిలిపోయాను
మానవసంబంధాలు మరుగై
కడలిని చూసే భయంతోనే నా కన్నీటినీ చూస్తున్నట్లు
బందాలన్నీ బందీనీ చేశాయి
దూరాన్ని లెక్కిస్తూ సంబంధాలకు దూరమవుతూ
సమాదానంలేని ప్రశ్నలు
మనసుని అల్లకల్లోలం చేస్తూన్నాయి
ఒక్కోసారి కడలి అందాలు ఆస్వాదిస్తూ
కన్నీటిని కడలిలోనే కలిపేస్తుంటా
ప్రశాంతమైన కెరటమై మనసుకు ఓదార్పు అవుతుందని
సూర్యచంద్రులను అక్కున చేర్చుకున్నట్లు
మనసు బందాలకు దగ్గర అవుతుందేమొనని...!!

..వాణి కొరటమద్ది
23 july 2014

Friday, July 18, 2014

చిట్టి తండ్రీ,
కనిపించని లోకాల్లో నీవున్నా నా కంటి ముందే వున్నట్లు భావన కన్నీరు ఏరులై పారుతూనే వుంది ఇంకా ఏదో ఆశ నాకెదురుగా వస్తావనే కోరికే మనసంతా నిండి వున్న మమత నిండిన నీ రూపం మరువ లేక పోతున్నాఆగనంటున్న కన్నీరు. కన్నీటి తడిలోనె అడుగులు వేస్తూన్నా నీ అడుగులు అడుగడుగునా ప్రశ్నిస్తూనే వున్నాయి. కనిపించని నీ రూపాన్ని తడుముకోవలనే తపనగా వుంది మనోవేదన కరిగిపోయే మమతల రూపం ఎదురుగ వున్నట్లు కలలా మిగిలిపోయిన ఆనందం కనుమరుగైన రూపం స్పర్శించానే సంకల్పం. ఆశలు కోల్పోయి అర్దాయుష్కుడైననా చిట్టి తండ్రి పరిపుర్ణజీవితం నిజమై పొయినట్లు గగనమంతా గాలిస్తున్నా స్వర్గంలో నా కోసం నిరిక్షిస్తూ కనిపించిన బంగారు తండ్రి అమ్మాని హత్తుకున్న నెరవేరని స్వప్నం.
స్వప్నం సాకారమయ్యే క్షణం కోసం ఆశగా ......
అమ్మ
//క్రొత్తనడక//

ఆశా వృక్షం కూకటి వేళ్ళతో కూలిపోయింది
వేళ్ళన్ని నావేగా వేదన మరింత భారంగా వుంది

ఒక్కసారిగా నా చుట్టూ ప్రపంచం చిన్నదైపోయింది
చెదిరిన కలలన్నీ గాయపు గుర్తులుగా
కన్నీటి బిందువులుగా కన్న కలలు కారిపోతూ

మనసంత నిండి వున్న రూపం
మరుగున పడక నిద్దురను కూడా వెలి వేసింది

నిరాశతోనే అడుగులు వేస్తూ
జ్ఞాపకాల తీరంలో క్రొత్తనడక నేర్చుకుంటూ

నీ అడుగుల గుర్తులు అడుగడుగునా ప్రశ్నిస్తుంటె
ఎడారిలో నడకలా జీవిత గమనం
కనిపించే నీరంతా కన్నీరే అవుతూ
గొoతు తడికి భాష్పాలే ఆధారమౌవుతూ

చిగురించని ఆశలు చిరునవ్వులు దూరం చేసి
చేజారిన అదృష్టాలు శాంతినీ దూరం చేసి
మది నిండా నీ రూపం దృశ్య కావ్యమే
నా కలం ఒలికించే అక్షరాలన్నీచిట్టి తండ్రి జ్ఞాపకాలే...!!

...వాణి కొరటమద్ది
//మువ్వలు//

అందెల రవళులు నటరాజుకు నీరాజనాలు
నాట్యరీతులకు సిరిమువ్వలు చిహ్నాలు

అలవోకగ కదిలే  పాదాలకు మడుగులోత్తుతూ
మువ్వల సవ్వడులు అందాన్నిస్తూ శ్రుతిలయలను వినిపిస్తూ

మోమున భావాలను పలికించి
రసాలను ఒలికించే రంజితమైన మంజీర నాదం
నాట్య కారిణి నేర్పరితనం

గాత్రానికి అనుగుణంగా గమకాలనూ గజ్జెల శభ్దంలో
భావాలు సవ్వడిలోఆహ్లాద పరుస్తూ

ఏ నాట్య రీతికైనా సిరిమువ్వల సవ్వడులు
రంజింప చేసే మధురధ్వనులు
భారతీయ సంసౄతీ సంప్రదాయలకు నాట్య విన్యాశాలు  ప్రతీకలు

...వాణి కొరటమద్ది
//వాయువు ( గాలి ).//

వెదురులో చేరి సంగీతాన్ని వినిపిస్తూ
పిల్ల తెమ్మెరగా ఆహ్లాద పరుస్తూ
వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తూ
ఎన్నో కబుర్లను రుచులను చేరవేస్తూ
బరువెక్కిన మేఘాలను తాకి వర్షం కురిపిస్తూ

ఒక్కోసారి భయంకరంగా మారీ
భీభత్సాలను ఉత్పాతాలను సృష్టిస్తూ
పర్వతాలను భూమిని సైతం పెకిలిస్తూ
నాశనం చేయగల వాయుశక్తిని
ఋగ్వేదంలో అభివర్ణించారు దేవతగా

మానవ శరీరమూ పంచ భూతాల నిర్మితమే
హృదయంలో వుంటూ ఉచ్చ్వాస నిశ్వాల ఆధారమై
జీవాత్మను వృద్దిచేయూ ప్రాణ వాయువు
ఆకాశము నుండి ఉద్బవించి శబ్ధము స్పర్స కలిగి
మానవుని మనుగడకు ఆవశ్యకమైన
పంచభూతాలలో రెండవది వాయువు ( గాలి )....!!

...వాణి కొరటమద్ది


 //అగ్ని //

నిప్పుని కనుగొని మలుపు సాధించిన మానవుడు వెలుగొందాడు
ప్రకృతి పై ఆధిపత్యం సాదించేలా జంతు సామ్రాజ్యపు రారాజులా

సనాతన సంప్రదాయంలో అగ్ని దైవస్వరూపం

అగ్ని మిళేపురోహితమని ఋగ్వేదం ప్రారంభం


అగ్ని బ్రహ్మ జేష్ట పుత్రుడు నిరాకార బ్రహ్మజ్యోతిస్వరూపం
సాకారా దేవతా రూపాలు అగ్ని రూపాలే

రూపమిచ్చేది అగ్నే రూపరహతుడూ అగ్నే

దేహంలో జఠరాగ్ని కంటిలో ప్రకాశం శరీరంలోఉష్ణత్వం

సూర్యుడు నక్షత్రాలు జ్ఞానాగ్ని వనాగ్ని
సమస్తం అగ్ని మయం మానసిక భావాలు అగ్నులే
క్షోధాగ్ని కామాగ్ని తపోగ్ని ఇలా సర్వం అగ్ని మయం జగత్
ఈశ్వరుడు బ్రహ్మ జ్యోతి సర్వత్రా నిండిన అగ్నిస్వరూపం

సూర్య నమస్కారాలు నిత్య దీపారాధన యజ్ఞ యాగాదులు
హిందూసంసృతికి చిహ్నాలు పవిత్రతకు శుద్ధతకు రూపాలు
...!!

vani koratamaddi
//అమ్మ ఒడి//

పేగు బంధం వీడి అమ్మ ఒడిలోకి చేరిన క్షణం
ముద్దు బిడ్డను చూసి మురిపొతుంది అమ్మ

ఉగ్గు పాలతో జోల పాటతో మెదలయ్యెను అమ్మఒడి పాఠాలు
తొలి బడి అమ్మ ఒడి అమ్మ ఒడి అద్రుష్టాల ఘని

మాటలు నేర్పుతూ మంచి చెడులు చెపుతూ
నడక నడత నేర్పుతూ  మరపురాని మధుర జ్ఞాపకం

అందని చందమామ మమతలతో అందిస్తూ
మారాము చేసే బిడ్డకు మాయ చేసి కడుపునింపుతూ
స్వార్ధం ఎరుగని సహనం నిండిన అమ్మ ప్రేమ

మనవిజయాలకు మనకి మించి సంబరపడేది అమ్మ
ఎంత ఎదిగిన వారికైనా అమ్మ ఒడి ఆశ వీడని బంధమే

...వాణి కొరటమద్ది
//కలం//

మనసు అనుభూతులను కలంగా మార్చి
తెల్లని కాగితంపై అక్షరాలౌతున్నభావ వ్యక్తీకరణం
మనసే జీవితపుస్తకమౌతుంది

కన్నీరు ఒలికించినా హాస్యాన్ని పలికించినా
అనుభవాల పాఠాలు అక్షరాలై
ఆలోచనలకు పదును పెడుతుంటాయి

స్పందనలు సృష్టిస్తూ కన్నీటిని సిరాగా మలిచి
అంతరాలలో దాగున్నాఆవేదన మనసుకు శాంతినిస్తాయి అక్షరాలై

అనుభవాలను ఆప్యాయతలను అనుభూతులను
మానవ సంభందాలు మెరుగుపరచుకోదానికి అవసరం కలం

రచయితలకు జర్నలిస్టులకు మేధాసంపన్నులకు
విజ్ఞులకు వివేచనాపరులకు భగవంతుని వరం కలం


...వాణి కొరటమద్ది
16 july 2014

Thursday, July 3, 2014

రాలేని నా చిట్టి తండ్రి కోసం మీ అమ్మ రాలుస్తున్న అక్ష్రర కన్నీరు ....

చెమ్మగిల్లిన కనుల వెనుక
చెప్పలేని నిజలెన్నొ
గతించిన`జ్ఞపకాలలో
గుండెపిండే గాధలెన్నో..

రాలె కన్నిటి బొట్టులోను..కనిపించె నీ రూపం..
నా చెతకని తనాన్ని..
నిలదీస్తున్నట్లుగా

నీవు లేవనే నిజం జీర్నించుకోలేని నా మనసు
భరించలేక బాధను..
నిన్ను హత్తుకోవాలని ఆశపడుతుంది

తడి ఆరని నా కళ్ళు..
కన్నీటి వర్షంకురిపిస్తూనే..వున్నా..
బాద్యతలు విస్స్మరించలేక..
నీవు లేని ఫ్రపంచంలో..
బ్రతక లేక..
బలహీనమైన నా గుండెను..
బ్రతికించాలని ప్రయతీన్స్తున్నా...

ఆశలు లేవు ..
ఆకాంక్షలు లేవు..
బలవంథంగా బ్రతుకీదుస్తూ..
నీవు లేని ప్రపంచంలో..
నిర్జీవంగా బ్రతికేవున్నా..

నీ `జ్ఞాపకలలో..
బాద్యతలు భరించలేక..
విస్మరించలేక..
మౌనంగా రొదిస్తూ..



vani koratamaddi
//మౌనం// 

మౌనంగా వున్న మనసు
పలుకులు కరువై
నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తూ
పదాలతో ప్రపంచాన్ని పలుకరిస్తుంది
నిట్టూర్పుల గాలులు భరించలేక
నిశిలోకి చూస్తూ 
మనసు తలపులు మూసుకుంటాను

నయనాలు కారుస్తున్న కన్నీరు
చెక్కిళ్ళపై చెదరని మరకలుగ మిగిలాయి
మాటలు పెదాలు దాటలేక
భావాలు ఉప్పెనలా.. 
అక్షరాలై ప్రవహిస్తుంటాయి 

వాణి కొరటమద్ది 25/3/2014
//నీ కోసం.....//


జో.కొట్టవా అమ్మ బజ్జుంటన్నన్నావు
గాఢనిద్రలోకెళ్ళావు జ్ఞాపకంగా మిగిలావు

నడక నేరుస్తానమ్మచేయి వదలమన్నావు
చెప్పకుండానే నాకుచేజారి వెళ్ళావు

నాబ్రతుకు గురించి బెంగ వొద్దన్నావు
బ్రంహ్మండంగా నేనుబ్రతికేస్తన్నావు

బాద నీకు వలదంటుభరోసానిచ్చావు
బాటలన్నీ మూసేసి బందించి వెళ్ళావు

కనిపించకున్నావు కనుచూపుమేరలో
జారిపోతావనుకోలేదు జాడలేకుండానే

మౌనంగా వున్నాను మనసు గెలవకున్నాను
అక్షరాలనే అమరుస్తూ పదాలనే ప్రొది చేస్తున్నాను


వాణి కొరటమద్ది
28/3/2014
//క్రొత్తనడక//

ఆశా వృక్షం కూకటి వేళ్ళతో కూలిపోయింది
వేళ్ళన్ని నావేగా వేదన మరింత భారంగా వుంది
ఆత్మీయ హస్తాలు దూరమనుకున్నారో
అంతర్వాణిలోనూ అవసరం లేదనుకున్నారో
ఒక్కసారిగా నా చుట్టూ ప్రపంచం చిన్నదైపోయింది
చెదిరిన కలలన్నీ గాయపు గుర్తులుగా
కన్నీటి బిందువులన్నీ కన్న కలలుగా కారిపోతూ
మనసంత నిండి వున్న రూపం మరుగున పడనివ్వలేక
మొత్తానికి నిద్దురకూడా వెలి వేసింది
జ్ఞాపకాల తీరంలో క్రొత్తనడక నేర్చుకుంటూ
నిరాశతోనే అడుగులు వేస్తూ
నీ అడుగుల గుర్తులు అడుగడుగునా ప్రశ్నిస్తుంటె
ఎడారిలో నడకలా జీవిత గమనం
కనిపించే నీరంతా కన్నీరే అవుతూ
గొoతుతడికి భాష్పాలే అధారమౌవుతూ
చిగురించని ఆశలు చిరునవ్వులు దూరం చేసి
చేజారిన అదృష్టాలు శాంతినీ దూరం చేసి
మది నిండా నీ రూపం దృశ్య కావ్యమే
నా కలం ఒలికించే అక్షరాలన్నీచిట్టి తండ్రి జ్ఞాపకాలే...!!

...వాణి కొరటమద్ది
3 july 2014