Saturday, May 9, 2015

||.అమ్మ||

ఏ జామున లేచేదో, నే లేచేసరికి
వాకిట్లో ముగ్గులు. ఆరేసిన బట్టలు మెరుస్తున్న గిన్నెలు
పూర్తయిన పనులన్నీ చూసి ఆశ్చర్యమే నాకపుడు 
అమ్మ మాత్రం లలితమ్మను స్మరిస్తూ దేవుడి ముందు కనపడేది
అమ్మ పడే కష్టం చూసి మనసు కలుక్కు మనేది
పాల గ్లాసు అక్కడ అంటూ సైగ చేసేది
ఎపుడూ నా ఉనికి కనిపెడుతూనే వుండేది
అమ్మ అంతగా చదువుకోలా
నన్ను మాత్రం చదివవించాలని ఆరాట పడుతుండేది
ఉన్నత స్ధానంలో చూడాలని ఆత్ర పడుతుండేది
అపుడనిపించేది నాలో ఆత్మవిశ్వాసం నింపాలనే ప్రయత్నం కాబోలని
ఎన్ని కధలు చెప్పింది అమ్మ
ఆ కధలన్నీ వీరత్వము చాటుకున్న మహిళలవే
నన్నే నాయిక చూపిస్తూ
ఆవిధంగా ధైర్యాన్ని నేర్పిందనుకుంటా అమ్మ
నే స్కూల్ నుండి వచ్చేసరికి
మొక్కలకు సేవచేస్తూ అమ్మ చిరునవ్వుతో
నాకు కాసిన్ని కలుపుమొక్కలు ఏరమని పురమాయించేది
అపుడూ అనిపించింది నాకు
ప్రకృతిని ప్రేమించమని
చెడ్డవారిని చెంతనుంచుకోవద్దని చెప్పినట్లుగా
రాత్రి అమ్మ ప్రక్కనే ఆరుబయట పడుకున్నపుడు
చందమామ కధలెన్నో
నక్షత్రాల పేర్లనూ చెప్పేది
ఆ పేర్ల వెనుక అంతరార్ధాన్ని వివరిస్తూ
అనిపించింది అపుడు నాకు
అమ్మ మనసు ఆకాశమంత విశాలమని
ఐదుదాకే చదివిన అమ్మ ఎంత ఉన్నతంగా ఆలోచించిందని
నేనమ్మనయ్యాక అర్ధమయ్యింది
అమ్మ అంతేనని స్త్రీ అంటేనే సహనమని...... !!
.